XtGem Forum catalog
Teluguworld.wap.sh






Sardaga Ammayila Tho



విడుదల తేదీ : 14 జూన్ 2013
TeluguWorld.wap.sh : 2.5/5
దర్శకుడు : పి. భాను శంకర్
నిర్మాత : పత్తికొండ కుమారస్వామి
సంగీతం : రవివర్మ
నటీనటులు : వరుణ్ సందేశ్, నిషా అగర్వాల్..

కెరీర్ మొదట్లో విజయాలు ఉన్నప్పటికీ ఆ తర్వాత సరైన విజయాలు లేక డీలా పడిపోయిన యంగ్ హీరో వరుణ్ సందేశ్ ఎలాగైనా హిట్ కొట్టి మళ్ళీ ఫామ్ లోకి రావాలని తెగ ట్రై చేస్తూ వరుసగా సినిమాలు చేసేస్తున్నాడు. ఈ సారి హిట్ కొట్టాలనే ఉద్దేశంతో గతంలో తనకి హిట్ ఇచ్చిన నిషా అగర్వాల్ తో కలిసి చేసిన ‘సరదాగా అమ్మాయితో’ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందు వచ్చింది. భాను శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని పత్తికొండ కుమారా స్వామి నిర్మించాడు. హిట్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాతో మళ్ళీ వరుణ్ సందేశ్ హిట్ అందుకున్నాడో లేదో ఇప్పుడు చూద్దాం..

కథ :
సంతోష్ (వరుణ్ సందేశ్)కి చిన్న నాటి నుంచి అమ్మాయిలంటే ఇష్టం ఉండడంతో పక్కా ప్లే బాయ్ లా పెరుగుతాడు. అలాగే దొరికిన అమ్మాయినల్లా వాడుకొంటూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంటాడు. అలా ఓ రోజు ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళిన సంతోష్ అక్కడ గీత(నిషా అగర్వాల్) ని చూసి ఇష్టపడతాడు. ఎలాగైనా ఆ అమ్మాయినీ లైన్ లో పెట్టాలని ప్రయత్నిస్తాడు. ఆ అమ్మాయి అంత ఈజీగా పడకపోవడంతో ప్రేమ అనే అస్త్రాన్ని ఉపయోగిస్తాడు. ఆ అమ్మాయి ప్రేమించే టైంకి సంతోష్ నిజ రూపం తెలుస్తుంది. దాంతో గీత సంతోష్ కి దూరంగా ఉంటుంది.
ఎలాగైనా గీత కావాలనుకున్న సంతోష్ గీతని తన ప్రేమని నిరూపించుకోవడానికి ఒక చాన్స్ ఇమ్మని అడుగుతాడు. అప్పుడు గీత సంతోష్ కి ఓ టెస్ట్ పెడుతుంది? ఆ టెస్ట్ సమయం అయిపోయే టైంకి ఉండాల్సిన ప్లేస్ లో గీత ఉండదు. కట్ చేస్తే ఆమె గీత కాదు డాక్టర్ అంజలి. అప్పుడు సినిమాలో ఓ పెద్ద ట్విస్ట్. ఆ ట్విస్ట్ ఏంటి? అంజలి గీతగా ఎందుకు మారింది? అసలు గీత అలియాస్ అంజలి సంతోష్ కి ఏం టెస్ట్ పెట్టింది? ఆ టెస్ట్ లో సంతోష్ గెలిచాడా? లేదా అనేదే? మిగిలిన కథాంశం.

ప్లస్ పాయింట్స్ :
ముందుగా హీరో గనుక వరుణ్ సందేశ్ గురించి, నటన ఎప్పటిలానే తన సినిమాల్లో ఎలా ఉంటుందో అలానే ఉంది. సినిమాలో వరుణ్ లుక్, కాస్ట్యూమ్స్ బాగున్నాయి. నిషా అగర్వాల్ బ్యూటిఫుల్ గా చూపించారు. ముఖ్యంగా పాటల్లో బాగుంది. నటన ఓకే. కానీ చాలా సీన్స్ లో ఆమె హావ భావాలు చూస్తే ఇలాంటి పాత్రలు ఇదివరకే చేసింది కదా అనిపిస్తుంది. అతిధి పాత్రలో కనిపించిన చార్మీ చాలా బబ్లీగా ఉంది. రావు రమేష్ పాత్ర చాలా బాగుంది, ఆ పాత్రకి రావు రమేష్ పర్ఫెక్ట్ గా సరిపోయారు. ఆయన పాత్రే ఈ సినిమాకి హైలైట్.
పీతాంబరం – ఆండాళ్ పాత్రల్లో అలీ – ముమైత్ ఖాన్ బాగా సెట్ అయ్యారు, కొంతవరకూ ప్రేక్షకులను నవ్వించారు. సెకండాఫ్ లో హీరో గర్ల్స్ హాస్టల్ లో చేసే సీన్స్ బాగా నవ్వుతెప్పిస్తాయి. ముఖ్యంగా అమ్మాయిలంతా కలిసి ఫేమస్ ఐటెం సాంగ్స్ కి వరుణ్ సందేశ్ చేత స్టెప్పులేయించే సీన్, అలాగే హీరో తెలియకుండా మూడ్ వచ్చే మెడిసన్ వేసుకొని కంట్రోల్ చేసుకోవడానికి ఇబ్బంది పడే సీన్స్ బాగా నవ్విస్తాయి. సినిమా సెకండాఫ్ లో వచ్చే మొదటి ట్విస్ట్ బాగుంది.

మైనస్ పాయింట్స్ :
దర్శకుడు భాను శంకర్ నేపధ్యం కొత్తగానే ఎంచుకున్నప్పటికీ కథ మాత్రం చాలా పాతదే కావడం అలాగే దానిని అదే పాత పద్దతిలో తెరకెక్కించడం సినిమాకి మొదటి మైనస్. ఫస్ట్ హాఫ్ అంత వేగంగా ఉండదు, అలాగే ఊహా జనిటంగా ఉంటుంది. సెకండాఫ్ ట్విస్ట్ ఇచ్చేంత వరకూ సినిమా బాగానే సాగినా ఆ తర్వాత నుంచి ఏదో సినిమాని రెండున్నర గంట లాగాలని సొల్లు కామెడీ పెట్టారు, అది ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తుంది. అసలే బాలేని ఫ్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ లో వరుసగా రెండు పాటలు రావడం ఆడియన్స్ ని మరింత ఇబ్బంది పెడుతుంది మరియు క్లైమాక్స్ సినిమాకి పెద్ద మైనస్. డైరెక్టర్ డబుల్ మీనింగ్ డైలాగ్స్ బాగానే రాయించుకున్నట్టు ఉన్నాడు. అందుకే సినిమాలో చాలా సన్నివేశాల్లో మనం డైలాగ్స్ కంటే బీప్ సౌండ్స్ నే ఎక్కువగా వింటాం.
కమెడియన్స్ ధర్వరపు సుబ్రహ్మణ్యం, ఎం.ఎస్ నారాయణ, కృష్ణ భగవాన్ లాంటి వారి నుండి సరైన కామెడీ రాబట్టుకోకపోవడం వల్ల వారి పాత్రలు వృధా అయ్యాయి. సినిమాలో ఎంటర్టైన్మెంట్ చాలా తక్కువగా ఉంది. చార్మీ చూడటానికి బబ్లీగానే ఉన్నా పేరున్న హీరోయిన్ హీరోయిన్ చేయాల్సిన పాత్ర కాదు. ఆమె పాత్ర వల్ల సినిమాకి ఏమాత్రం ఉపయోగం లేదు. మాములుగా ఒక ప్లే బాయ్ పాత్ర చివరికి ఒకమ్మాయి ప్రేమలో పడి తన క్యారక్టర్ ని మార్చుకున్నాడు అంటే ఏదో బలమైన కారణం ఒకటి పెడతారు. కానీ ఈ సినిమాలో అలాంటిది ఏమీ ఉండదు. అసలు ఎందుకు హీరో తన క్యారక్టర్ మార్చుకున్నాడా? అనేదానికి జస్టిఫికేషన్ లేదు.

సాంకేతిక విభాగం :
సాంకేతిక విభాగంలో మొదటగా చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రాఫర్ గురించి, సినిమా తీసింది లోకల్ లోనే అయినా లోకేషన్స్ ని చాలా బాగా చూపించాడు. నటీనటులను కూడా బాగా చూపించాడు. ఎడిటర్ ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఫస్ట్ హాఫ్ లో రిపీట్ గా అనిపించే సీన్స్ ని, ప్రీ క్లైమాక్స్ లో వచ్చే సొల్లు కామెడీని కట్టించి పారేయాల్సింది. డైలాగ్స్ బాగున్నాయి కానీ డబుల్ మీనింగ్ తగ్గుంటే బాగుండేది. ముఖ్యంగా రావు రమేష్ పాత్రకి రాసిన డైలాగ్స్ బాగున్నాయి. రవివర్మ అందించిన పాటలు బాగున్నాయి, అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది.
దర్శకుడు పి. భాను శంకర్ ఎంచుకున్న ఒక్క నేపధ్యం విషయంలో తప్ప మిగతా ఏ ఒక్క విషయంలోనూ సక్సెస్ కాలేకపోయాడు. కథ – ఇలాంటి స్టోరీలు చాలానే వచ్చాయి. స్క్రీన్ ప్లే – ఉన్న ఒక్క మెయిన్ ట్విస్ట్ తప్ప మిగతా అంతా వీక్ గా ఉంది. దర్శకత్వం కొన్ని రకాల సీన్స్ లో మంచి మార్కులేసుకున్నప్పటికీ, కొన్ని ముఖ్యమైన సీన్స్ లో మాత్రం పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. పత్తికొండ కూమారస్వామి నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :
‘సరదాగా అమ్మాయితో’ సినిమా కాస్త సరదాగా, కాస్త బోరింగ్ గా ఉంది. వరుణ్ సందేశ్, నిషా అగర్వాల్ హిట్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ఊహించిన స్థాయిలో లేదు. నటీనటుల నటన, అక్కడక్కడా కామెడీ, మ్యూజిక్ తప్ప చెప్పడానికి ఏమీ లేని ఈ సినిమాకి రొటీన్ కథ, వీక్ స్క్రీన్ ప్లే, హీరో రోల్ కి జస్టిఫికేషన్ లేకపోవడం, వీక్ క్లైమాక్స్ ఎపిసోడ్ చెప్పదగిన మైనస్ పాయింట్స్. చివరిగా ‘హిట్ అందుకోలేకపోయిన హిట్ పెయిర్’.


TeluguWorld.wap.sh:-2.5/5




Users Online


1576